ఐఫోన్ నదిలో ఏడాది ఉన్నా…!
అమెరికా: ఖరీదైన ఫోన్లు ఒక్కసారి కిందపడితేనే హ్యాంగ్ అవుతూ ఉంటాయి. అలాంటిది నదిలో పడిపోయిన ఓఐఫోన్ ఏడాది తర్వాత మరో వ్యక్తికి దొరకడమే కాదు చక్కగా పనిచేస్తోంది కూడా. వివరాల్లోకెళితే.. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రానికి చెందిన మైఖెల్ ఏడాది క్రితం ఓ నదిలో ఐస్ ఫిషింగ్ చేస్తున్నాడు. అప్పుడు పొరపాటున తన వద్ద ఉన్న ఐఫోన్-4 జారి నీళ్లలో పడిపోయింది. ఎంత వెతికినా అది దొరకలేదు. దాంతో మైఖెల్ తన ఫోనుపై ఆశలు వదులుకున్నాడు.
ఏడాది తర్వాత డేనియల్ కాల్‌గ్రామ్ అనే మెకానికల్ ఇంజినీర్‌కి ఆ ఫోన్‌దొరికింది. డేనియల్‌కి ట్రెజర్ హంటింగ్ అంటే ఇష్టం. ఓసారి డేనియల్..మైఖెల్ ఫోన్ పోగొట్టుకున్న నదిలో ట్రెజర్ హంటింగ్ చేస్తున్నాడు. నీటి అడుగున బురదలో ఇరుక్కుపోయిన ఫోను డేనియల్ వద్ద ఉన్న మెటల్ డిటెక్టర్‌కి దొరికింది. డేనియల్ దాన్ని ఇంటికి తీసుకెళ్లి శుభ్రం చేసి బియ్యం సంచిలో పెట్టాడు. ఆ తర్వాత రెండు రోజుల పాటు చార్జింగ్ పెట్టడంతో ఫోన్ చక్కగా పనిచేసింది. ఆ తర్వాత అందులో ఉన్న ఫోన్ నెంబర్ల ఆధారంగా డేనియల్ మైఖెల్ ఆచూకీ తెలుసుకోగలిగాడు. జరిగిన విషయం చెప్పడంతో తాను పోగొట్టుకున్న ఫోన్ ఏడాది తర్వాత దొరికిందని మైఖెల్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు.
మామూలుగా అయితే ఐఫోన్ 365 రోజుల పాటు నీటిలో అదీ బురదలో ఇరుక్కుపోతే పనిచేయడం అసాధ్యం. కానీ మైఖెల్ వాడిన ఫోన్‌కి రబ్బర్ కేసు ఉండడంతో దాన్ని రిపేర్ చేయగలిగాడు డేనియల్.

No comments: